Saturday, January 19, 2013

EAMCET - 2013 PREPARATION PLAN

పేరున్న కళాశాలలో, ఇష్టమైన బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చదవాలి. నాలుగేళ్ళూ కష్టపడి చదివితే ఇక భవితకు తిరుగే ఉండదు!... ఎంపీసీ విద్యార్థుల అంతరంగమిది. దీనికి పునాది ఎంసెట్‌లో మంచి ర్యాంకు. దీన్ని సాధించటానికి పటిష్ఠంగా వ్యూహం రూపొందించుకోవాలి కదా! అదెలాగో- చదవండి... మనరాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులకు ఇంటర్‌ విద్య అంటే ఎంపీసీ లేదా బైపీసీ. వీరిలోనూ ఎక్కువమంది ఇంజినీరింగ్‌వైపు అంటే ఎంపీసీకే మొగ్గు చూపుతున్నారు. సీనియర్‌ ఇంటర్మీడియట్లో దాదాపు 9 లక్షలమంది విద్యార్థులుంటే వారిలో దాదాపు 4 లక్షలమంది ఎంపీసీ విద్యార్థులే! వీరిలో ఒక శాతం విద్యార్థులు ఐఐటీలకూ, ఒకశాతం విద్యార్థులు ఎన్‌ఐటీలకూ వెళ్తున్నారు. బీఎస్‌సీ కోర్సువైపు వెళ్ళేవారిని మినహాయిస్తే అత్యధిక శాతం విద్యార్థులు ఎంసెట్‌ ఆధారంగా ప్రవేశాలు జరిపే ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనో, స్వయంప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లోనో చేరటానికి ఇష్టపడుతున్నారు. ఇంజినీరింగ్‌ ఆశావహులకు మనరాష్ట్రంలో అవసరానికి మించిన సంఖ్యలో సీట్లున్నాయి. కానీ ఇంజినీర్లుగా ఉజ్వల భవిత పొందాలంటే తొలి 5 శాతం ఎంసెట్‌ ర్యాంకర్లలో ఒకరుగా ఉండాల్సిందే. అప్పుడే ఆశించిన ఇంజినీరింగ్‌ కళాశాలలో, కోరుకున్న బ్రాంచిలో చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఇంజినీరింగ్‌ చేయాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయ కళాశాలల్లో లేదా ప్రసిద్ధ (టాప్‌ 20) ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సాధించే ర్యాంకు తెచ్చుకోవాలి. ఎంసెట్‌ ప్రణాళికను ఆ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించుకోవాలి. ర్యాంకును ఎలా నిర్థారిస్తారు? ఎంసెట్‌లో విద్యార్థి సాధించిన మార్కులకు 75 శాతం, ఇంటర్‌ గ్రూప్‌ సబ్జెక్టుల్లో తెచ్చుకున్న మార్కులకు 25 శాతం వెయిటేజి ఇచ్చి ఎంసెట్‌ తుది ర్యాంకును నిర్థారిస్తారు. ఇక్కడ ఇంటర్మీడియట్‌ మార్కులంటే- ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మొత్తం మార్కులు 1000 కాదు. వాటిలో లాంగ్వేజెస్‌ మార్కులు 400 మార్కులను తీసేయగా మిగిలిన 600 మార్కులకు విద్యార్థి ఎన్ని సాధిస్తాడో వాటిని 25కు కుదిస్తారు. అంటే ఇంటర్లో విద్యార్థి సాధించిన ప్రతి 24 మార్కులకూ ఎంసెట్‌ తుది ర్యాంకులో ఒక మార్కు వెయిటేజి పెరుగుతుంది. ఈ విశ్లేషణ చూడండి గత ఏడాది తొలి 20 వేలమంది విద్యార్థుల మార్కులు గమనిస్తే... వారి మార్కుల్లో గరిష్ఠ వ్యత్యాసం 50 వరకూ ఉంది. అంటే ఇంటర్లో గ్రూప్‌ సబ్జెక్టుల్లో 600 మార్కులకు 550పైన సాధించిన విద్యార్థులే ఉన్నారు. కాబట్టి ఎంసెట్‌ తుది ర్యాంకులో ఏర్పడే మార్కుల తేడా కేవలం రెండు మార్కులు మాత్రమే! ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజి ఉన్నప్పటికీ తుది ర్యాంకు నిర్థారణ కేవలం విద్యార్థి ఎంసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఇంకొక విధంగా విశ్లేషిస్తే... ఇంటర్‌ గ్రూప్‌ సబ్జెక్టుల్లో ఒక మార్కు వ్యత్యాసం ఉంటే తుది ర్యాంకు నిర్థారణకు తీసుకునే ఇంటర్‌ వెయిటేజిలో మార్పు 0.04167 మాత్రమే! ఈ ఇంటర్‌ మార్కుల వల్ల ఒకే మార్కు వచ్చిన విద్యార్థులకు తుది ర్యాంకు నిర్థారణ అంటే 10 నుంచి 50 లోపు ర్యాంకులు మాత్రమే మారే అవకాశముంది. అంతేగానీ ఏ విద్యార్థి కూడా కేవలం ఇంటర్‌ మార్కుల ఆధారంగా మంచి ర్యాంకు సాధించే అవకాశం లేదు! ఇంటర్‌ Vs ఎంసెట్‌ ఎంసెట్‌ 160 మార్కులకు జరిగితే దానిలో విద్యార్థి సాధించిన మార్కులను 75కి కుదిస్తారు కదా? అంటే ఎంసెట్‌లో విద్యార్థి పొందే ప్రతి రెండు మార్కులకూ సమారుగా తుది వెయిటేజిలో ఒక మార్కు పెరుగుతుంది. లేదా ఎంసెట్‌లో విద్యార్థి పొందే ఒక మార్కుకు అతని తుది ఎంసెట్‌ ర్యాంకు నిర్థారణలో వెయిటేజి 0.46875 పెరుగుతుంది. ఇంటర్‌ మార్కులూ ఎంసెట్‌ మార్కులను పోలిస్తే... ఇంటర్‌లో సాధించిన 14 మార్కులు ఎంసెట్‌లో సాధించే ఒక మార్కుతో సమానం! దీన్నిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... ఇంటర్‌ మార్కులకంటే ఎంసెట్‌లో అధిక మార్కుల సాధనకే ప్రాధాన్యం ఇవ్వాలి! వెయ్యిలోపు ర్యాంకు రావాలంటే... ఎంసెట్‌ (మొత్తం 160 మార్కులు) లో గత సంవత్సరం ఏ మార్కు సాధిస్తే ఏ ర్యాంకు వచ్చిందో పరిశీలిద్దాం. 140 మార్కులపైన సాధిస్తే 50లోపు ర్యాంకు 136 పైన సాధిస్తే 100 లోపు ర్యాంకు 120 మార్కులపైన సాధిస్తే 500లోపు ర్యాంకు 110 మార్కులపైన సాధిస్తే 1000లోపు ర్యాంకు 90 మార్కులపైన సాధిస్తే 5000లోపు ర్యాంకు ఈ విశ్లేషణను పరిశీలిస్తే... ఎంసెట్‌లో 110 నుంచి 120 మార్కులు తెచ్చుకోగలిగితే కచ్చితంగా 1000లోపు ర్యాంకు వస్తుందని తెలిసిపోతోంది కదా? ప్రణాళికాబద్ధంగా తయారైతే ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ సీటు సాధించటం అంత కష్టమేమీ కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మార్కులకు మెలకువలు ఇంటర్‌లో సాధించిన 14 మార్కులు ఎంసెట్‌లో సాధించే ఒక మార్కుతో సమానం! ఇంటర్‌ మార్కులు గరిష్ఠంగా తెచ్చుకోవాల్సిందే కానీ- ఆ మార్కుల కంటే ఎంసెట్‌లో అధిక మార్కుల సాధనకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మంచి ర్యాంకు వస్తుంది! ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పాఠ్యాంశాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఉండే 80 లెక్కల ప్రశ్నల్లో దాదాపు 40 ప్రథమ సంవత్సరం నుంచి వస్తాయి. భౌతికశాస్త్రంలోని 40 ప్రశ్నల్లో దాదాపు 20; రసాయనశాస్త్రంలోని 40 ప్రశ్నల్లో దాదాపు 20 ప్రశ్నలు ప్రథమ సంవత్సర సిలబస్‌ నుంచే వస్తాయి. ఎంసెట్‌ తయారీలో ఫలానా పాఠ్యాంశాలకు ప్రాధాన్యం, ఫలానావాటికి ప్రాధాన్యం లేదు- అంటూ ఏమీ లేదు. అన్నిటికీ సమ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. అయితే సులువుగా, తక్కువ పరిమాణంలో ఉన్న అధ్యాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం తెలివైన పని. ఉదాహరణకు- భౌతికశాస్త్రంలో 1) శుద్ధ గతికశాస్త్రం నుంచి ఒక ప్రశ్న వస్తుంది 2) ప్రమాణాలు-మితులు నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. కానీ రెండోది చాలా చిన్న అధ్యాయం. తప్పులు చేసే అవకాశాలు కూడా తక్కువ. కాబట్టి ఇటువంటి అధ్యాయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అనుకూలంగా మల్చుకుని... ఎంసెట్‌లో పాసవడానికి ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులుండాలనే నిబంధన లేదు. అందుకే విద్యార్థులు తమకు పట్టు ఉన్న సబ్జెక్టులో ఎక్కువ పొంది, వేరొకదానిలో తక్కువ మార్కులు వచ్చినా వెయ్యిలోపు ర్యాంకు పొందొచ్చు. అధికశాతం ఎంపీసీ విద్యార్థులు లెక్కలు బాగానే చేస్తారు కదా? దానిలో 80 మార్కులకు 70 మార్కులపైన సాధించి, కెమిస్ట్రీలో 40 మార్కులకు 30 మార్కులు సాధిస్తే.. ఫిజిక్స్‌లో 10-15 మార్కులు సాధించినప్పటికీ 1000 లోపు ర్యాంకు సాధ్యమే! పరీక్ష రాసేటప్పుడు సమయపు ఒత్తిడికి లోనుకాకుండా పట్టు ఉన్న సబ్జెక్టుతోనే పరీక్ష ప్రారంభించడం మేలు. జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ప్రశ్నల సంఖ్య తక్కువ కాబట్టి ఒత్తిడి ఉండదు. ఎంసెట్‌లో ఎక్కువ ప్రశ్నల వల్ల ఈ సమస్య ఉంటుంది. అందుకని ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివర్లో ప్రయత్నించాలి కానీ, పరీక్ష ప్రారంభంలో వాటికి సమయం కేటాయించకూడదు. ఎంసెట్‌లో రుణాత్మక (మైనస్‌) మార్కులు లేవు. తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించకుండా వదిలివేయనక్కర్లేదు. జవాబులు తెలియని అన్ని ప్రశ్నలకూ ఒకే జవాబు గుర్తిస్తే... ఎక్కువ ప్రశ్నలు కరెక్టయ్యే సంభావ్యత ఏర్పడుతుంది. ఇప్పటినుంచి చదివినా... ఎంసెట్‌కు సుమారు నాలుగు నెలల వ్యవధి ఉంది. ఇప్పటినుంచి ప్రణాళికతో చదివినా మంచి ర్యాంకు సాధించవచ్చు. మార్చి 19 (ఇంటర్‌ పరీక్షల) వరకూ సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌కు పరిమితమవ్వాలి. ఇంటర్‌ అకాడమీ పుస్తకాలతో పాటు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను కూడా సాధన చేస్తుంటే ఎంసెట్‌తో పాటు ఇంటర్లో ఉండే 2 మార్కుల ప్రశ్నలకూ ఉపయోగం. మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 7 వరకూ జేఈఈ మెయిన్స్‌కు కొంత అభ్యాసం చేసి, తర్వాత జూనియర్‌ ఇంటర్‌కు 20 రోజుల ప్రాధాన్యం ఇచ్చి చదివితే సరిపోతుంది. ఇలా తయారు కాగలిగితే ఎంసెట్‌తో పాటు బిట్‌శాట్‌ లాంటి పరీక్షలు కూడా బాగా రాయవచ్చు. ఎంసెట్‌లో అకాడమీ పుస్తకాల పరిధి దాటి బయట ఒక ప్రశ్న కూడా ఇవ్వటం లేదు. అందుకని అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమై వాటిని పునశ్చరణ (రివిజన్‌) చేయటం మేలు. ప్రశ్నల సంఖ్య అధికం కాబట్టి ఎక్కువ నమూనా పరీక్షలు అభ్యాసం చేయాలి. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభించినా సరిపోతుంది. ఒక అభ్యాసానికి పరిమితమై పరీక్షలు రాసేకంటే మొత్తం సిలబస్‌లో ఎక్కువ గ్రాండ్‌ టెస్టులు రాయటం ఎక్కువ లాభదాయకం. పరీక్ష హాల్లో లెక్కలు 1.15 గంటలు, కెమిస్ట్రీ 45 నిమిషాలు, ఫిజిక్స్‌ 1 గంట మించి చేయకూడదు. ఇది గరిష్ఠ అవధిగా తీసుకుని అభ్యాసం చేయాలి. కెమిస్ట్రీలో గ్రూపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిని పోల్చడానికి వీలుగా పట్టికలు (టేబుల్స్‌) తయారుచేసుకుని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. సెకండియర్‌ ఫిజిక్స్‌లో సర్క్యూట్‌ డయాగ్రమ్‌ ఉన్న ప్రశ్నలు ఎంసెట్‌లో ఇవ్వటం లేదు. అందుకని ఆ లెక్కలు చేయడానికి సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఈ అంశాలన్నిటిపై దృష్టి పెట్టి సన్నద్ధత కొనసాగిస్తే ఎంసెట్‌లో మీకు ఎదురులేనట్లే!

No comments:

Post a Comment