Saturday, April 13, 2013

ఎంసెట్‌కు 3.94 లక్షల దరఖాస్తులు

ఎంసెట్‌కు 3.94 లక్షల దరఖాస్తులు
* ఒక్కనిమిషం ఆలస్యమైనా అనుమతించరు
* తొలిసారిగా బాల్‌పాయింటు పెన్ను వినియోగం
* ఓఎమ్మార్ షీటుపై విద్యార్థి వేలిముద్ర
* జూన్ 2న ఫలితాలు
ఏఎన్‌యూ (గ్రామీణ మంగళగిరి), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా మే 10న ఎంసెట్ పరీక్షను సమర్థంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రారు ఆచార్య ఎన్.వి. రమణారావు చెప్పారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై గుంటూరు ప్రాంతీయ కేంద్రం పరిధిలోని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులతో ఏప్రిల్ 13న సమావేశం నిర్వహించారు. అనంతరం రమణారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు 3.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో ఇంజినీరింగు విభాగానికి 2.89 లక్షల మంది; అగ్రికల్చర్, మెడిసిన్‌విభాగానికి 1.05 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 10 వేల మంది అభ్యర్థులు మెడిసిన్‌కు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 17వ తేదీవరకూ, రూ.5000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 27 వరకూ, రూ. 10,000 అపరాధ రుసుంతో మే 7వ తేదీవరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగు విభాగానికి 750, మెడిసిన్ విభాగానికి 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఓఎమ్మార్ షీట్లపై జవాబులను నమోదు చేసేందుకు నలుపు లేదా నీలం రంగు బాల్‌పాయింటు పెన్నులు మాత్రమే వినియోగించాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి పరీక్షా కేంద్రానికి 45 నిముషాలు ముందుగానే చేరుకోవాలని చెప్పారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆసల్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. ఓఎమ్మార్ షీటుపై విద్యార్థి ఎడమచేతి వేలిముద్రను తీసుకుంటామని చెప్పారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటరు, ప్రతి 500 మంది విద్యార్థులకు ఒక పరిశీలకుడిని నియమించామని తెలిపారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షతో పాటు, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్ పరీక్షలను రాయవచ్చని చెప్పారు. ఎంసెట్ ఇంజినీరింగు ఫలితాలను జూన్ 2న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎంసెట్ మెడిసిన్ పరీక్ష ఫలితాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకటిస్తామని రమణారావు చెప్పారు.

No comments:

Post a Comment