Wednesday, October 29, 2014

ఐబీలో అవకాశాలు
హోం మంత్రిత్వ శాఖలోని ఇంటలిజన్స్‌ బ్యూరో (ఐబీ) విభాగంలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. డిగ్రీ విద్యార్హతతో కేంద్రప్రభుత్వ కొలువును పొందే ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలి!
దేశవ్యాప్తంగా 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ గ్రేడ్‌-2/ గ్రూప్‌-సి కేటగిరీ ఉద్యోగాల్లో చేరినవారికి రూ.35,000- 40,000 నెల జీతం వస్తుంది. వీటి నియామకానికి మూడు దశల్లో పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లుంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. దానిలో నెగ్గినవారిలో ప్రతిభావంతులతో పోస్టులను భర్తీ చేస్తారు.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.
వయ: పరిమితి:
జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు: 18- 27 సంవత్సరాలు
ఓబీసీ: 3 సంవత్సరాలు మినహాయింపు
ఎస్‌సీ, ఎస్‌టీ: 5 సంవత్సరాలు మినహాయింపు
* భర్త చనిపోయి/ విడాకులు పొంది తిరిగి వివాహం చేసుకోని జనరల్‌ కేటగిరీ మహిళలకు 8 సంవత్సరాలు.
* ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ మహిళలకు 13 సంవత్సరాల మినహాయింపు
* శారీరక వైకల్యం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు కారు.
* అభ్యర్థులు తమ వయసును 9.11.2014తో పోల్చుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటగా రాత పరీక్షలో రెండు పేపర్లు నిర్వహిస్తారు.
పేపర్‌-1: పేపర్‌-1లో మొత్తం ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. రీజనింగ్‌, మేథమెటికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టుల నుంచి ఈ ప్రశ్నలుంటాయి.
పేపర్‌-2: పేపర్‌-2 మొత్తంగా డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. ఇందులో కేవలం ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నలు ఇంగ్లిష్‌ రైటింగ్‌ స్కిల్స్‌, విశ్లేషణ శక్తి సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి.
ఈ రెండు పేపర్లకుగానూ 100 నిమిషాల సమయం కేటాయించారు.
రెండు పేపర్లలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. మౌఖిక పరీక్ష కూడా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేపథ్య తనిఖీని పూర్తిచేసి వారి మెరిట్‌ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం జనరల్‌ కేటగిరీ, ఓబీసీ, పురుషులు రూ. 100 చెల్లించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలి.
ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు, అన్ని కేటగిరీల మహిళలు ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తిచేయడానికి ఆఖరు తేదీ: 9 నవంబర్‌, 2014
* దరఖాస్తులు నింపే విషయంలో అభ్యర్థులు కచ్చితమైన వివరాలను మాత్రమే నింపాలి. అదేవిధంగా దరఖాస్తులు పూర్తిచేసిన తరువాత వాటిని ప్రింట్‌ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణ: హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌: విజయవాడ
సమీప పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్‌
సన్నద్ధత ఇలా... స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌- కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ పరీక్షను సులువుగా రాసే వీలుంటుంది. సీజీఎల్‌ పరీక్షలో ఉండే సబ్జెక్టుల నుంచి పేపర్‌-1 పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష కాబట్టి దీనిమీద ప్రత్యేక శ్రద్ధ చూపితే సులువుగా ఈ రెండు పేపర్లలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
అభ్యర్థులు ముందుగా ఒక మాదిరి ప్రశ్నపత్రానికి సమాధానాలు రాసి ఏ విభాగాల మీద ఎంతవరకూ మార్కులు వస్తున్నాయో గమనించుకోవాలి. వెనుకబడిన విభాగాల మీద ప్రత్యేక శ్రద్ధచూపి ఎక్కువ సమయం కేటాయించి ఆయా విభాగాల నుంచి ఎక్కువ మార్కులు పొందేలా ప్రణాళిక రచించుకోవాలి.
రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాన్ని పెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు పెట్టేవిధంగా సాధన చేయాలి. సమాధానాలు పెట్టిన ప్రశ్నల నుంచి కనీసం 95% ప్రశ్నలు ఒప్పయ్యేలా ఉండాలి.
వీలైనన్ని మాదిరి పరీక్షలు రాస్తూ, మార్కులు పెరిగేలా సన్నద్ధమవాలి. పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షకు ముందే ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. దానికి అనుగుణంగా సన్నద్ధమైతే పరీక్షలో సులువుగా విజయం పొందగలుగుతారు.

No comments:

Post a Comment